వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు నమోదయింది. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పీఎస్‌లో అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ సీఎం జగన్ భద్రతపై పోలీసుల సూచనలు తోపుదుర్తి పాటించలేదని ఫిర్యాదులో సదరు కానిస్టేబుల్ పేర్కొన్నారు. హెలీప్యాడ్ చుట్టూ బ్యారికేడ్ల ఏర్పాటులో తోపుదుర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు.
హెలికాప్టర్ నుంచి జగన్ దిగకముందే కార్యకర్తలు దూసుకొచ్చి.. హెలికాప్టర్‌ను చుట్టుముట్టినట్లు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలను అడ్డుకుంటుంటే పోలీసులపై తోపుదుర్తి దుర్భాషలాడినట్లు సదరు కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు పోలీసుల విచారణలో నిర్ధరణ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. భద్రతా వైఫల్యంగా చూపాలని కార్యకర్తలను తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.