విలువలు, విశ్వసనీయతే వైఎస్సార్సీపీ సిద్ధాంతం అని.. ఆ సిద్ధాంతాన్ని తాను గట్టిగా విశ్వసిస్తానని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లామని.. ఆ ప్రస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి బలమైన పార్టీగా మారిందని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
వైస్సార్సీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడిందని వైఎస్ జగన్ అన్నారు. ఆరోజు నుంచి వారంతా తనతోనే అడుగులు వేశారని కర్నూలు ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే తన పార్టీ సిద్ధాంతం అని.. వాటికి అర్థం చెప్పిన పార్టీ తమదని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అని పేర్కొన్న జగన్.. ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.