మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆదివారం రోజున నిందితులు వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకానందరెడ్డి మృతదేహంపై గొడ్డలిపోట్లు స్పష్టంగా కనిపిస్తున్నా గుండెపోటు, రక్తపు వాంతులతో కూడిన మరణంగా ప్రచారం ఎందుకు చేశారనే అంశంపై పలు ప్రశ్నలు సంధించారు. వివేకా చనిపోయినట్లు రాత్రి మూడున్నర సమయంలోనే మీకెలా తెలిసిందని ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.
హత్యాస్థలిని భాస్కర్ రెడ్డి తన అధీనంలోకి తెచ్చుకొని రక్తపు మరకల్ని శుభ్రం చేయించారని సీబీఐ అనుమానిస్తోంది. భాస్కరరెడ్డిని ఈ విషయమై ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. వివేకా హత్య సమయంలో పడకగది, బాత్రూంలో చిందిన రక్తపు మరకల్ని కడిగించడం.. ఆసుపత్రి నుంచి కాంపౌండర్‌ను పిలిపించి మృతదేహానికి బ్యాండేజీతో కట్లు కట్టించడం.. వివేకా గుండెపోటుతో మరణించారని పోలీసులకు సమాచారమివ్వడం.. అదే నిజమని నమ్మించేందుకు గాయాలు కనిపించకుండా పూలతో అలంకరించడం.. ఫ్రీజర్‌బాక్స్‌ను తెప్పించడం.. గుండెపోటు మరణం అని ప్రచారం చేయడం.. లాంటి పరిణామాల వెనక భాస్కరరెడ్డి పాత్ర గురించి ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.