ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే విషయంపై ఏళ్ల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. కానీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే తాజాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది.
14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం ఏపీకి నిధులు కేటాయించిందా? అని వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
‘‘14వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయింది. అందుకే ప్రత్యేక హోదాకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. 2015 నుంచి 2018 వరకు ఈఏపీ పథకాలకు తీసుకున్న రుణాలపై వడ్డీని కూడా చెల్లించాం. అందుకోసం రూ.15.81 కోట్లు విడుదల చేశాం’’ అని నిత్యానందరాయ్ వెల్లడించారు.