ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి కేంద్ర ప్రభుత్వం నిరాశను మిగిల్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి తేల్చి చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని లోక్ సభలో అడిగారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అన్నారు. ఏపీ కాకుండా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదని మంత్రి నిత్యానంద్ వెల్లడించారు. ప్రత్యేక హోదా కు బదులుగా కేంద్రం పనుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచినట్లు ఆయన వివరించారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం కూడా అవే సిఫార్సులను కొనసాగించినట్లు ఆయన పేర్కొన్నారు. విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చామని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.