ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఇవాళ కొత్త ఇంట్లోకి సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం గృహప్రవేశం చేయబోతోంది. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడుకు… ఏపీలో సొంత ఇల్లు లేదని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆయన తన సొంత నియోజకవర్గ కుప్పంలోనే కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన ఇంట్లో ఈ తెల్లవారుజామున గృహప్రవేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా నారా భువనేశ్వరి పంచుకున్నారు. 36 సంవత్సరాలుగా కుప్పం ప్రజలు మా కుటుంబానికి అండగా ఉంటున్నారని.. నారా భువనేశ్వరి పేర్కొన్నారు. సొంతింటి పండగ లాగా… తమ కొత్త ఇంటికి ప్రజలు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.