ఏపీ సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ రాశారు. గోదావరి వరదలతో ప్రజల కష్టాలు, పోలవరం నిర్వాసితుల సమస్యలపై లేఖ రాసిన చంద్రబాబు… గోదావరి వరదలపై నాలుగు జిల్లాల్లో వరద బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది… పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాలని కోరారు.
గోదావరి వరదలు వేల కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయి… ఇళ్లు కూలిపోయి, మునిగిపోయి భారీ నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి బాధిత ప్రజలకు సరైన సాయం అందలేదని.. ఇప్పటికీ ముంపు గ్రామాల ప్రజలకు ఇళ్లలోకి తిరిగి వెళ్లలేని దారుణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 2014లో హుద్ హుద్ సమయంలో, 2018లో తిత్లీ తుఫాను సమయంలో టీడీపీ ప్రభుత్వం పరిహారం పెంచి ఇచ్చింది.. 8 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు పెరిగిన ధరలు, వరదల తీవ్రత, జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత పెంచాలని డిమాండ్ చేశారు.
గ్రామాలకు గ్రామాలు వారం రోజుల పాటు వరదలో ఉండిపోవడం వల్ల నష్టం, కష్టం రెట్టింపయ్యిందని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుటుంబానికి రూ. 2 వేల సాయం న్యాయ బద్దంగా లేదని ఫైర్ అయ్యారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు ఇవ్వాలని.. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 10 వేలు.. పూర్తిగా దెబ్బతిన్న కచ్చా ఇంటికి రూ. 25 వేలు అందించాలని కోరారు.