జమిలి అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది 2029 లోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు. జమిలీ పై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని తెలిపారు.
వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని పేర్కొన్నారు. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు… రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతీ చోటా దీనిపై చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని పేర్కొన్నారు. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని చెప్పారు.