సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో అన్నారు. ఎన్డీయే సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వివరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారన్న చంద్రబాబు.. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని చెప్పారు.