ఏపీ అప్పులపై 4 శ్వేత పత్రాలు విడుదల చేయనుంది చంద్రబాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభాన్ని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాస్తవ ఆర్థికచిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు శ్వేత పత్రాలు వెలువరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తు కూడా ప్రారంభమైంది. గడిచిన ఐదేళ్లలో ఆర్థిక శాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకల్ని, అప్పుల్ని లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు.
ఇందుకు ఎవరెవరు కసరత్తు చేయాలో ఇప్పటికే నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ్ ఈ విషయం వెల్లడించారు. ఆర్థికశాఖకు సంబంధించే నాలుగు శ్వేతపత్రాలు వెలువరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని అప్పులు తీసుకున్నారో లెక్క తేలుస్తున్నారు. దీంతోపాటు కార్పొరేషన్ల ద్వారానే ఏ స్థాయి అప్పులు చేశారు? ఆ అప్పులను వేటికి వెచ్చించారు? ఈ రూపంలో అప్పులు చేసేందుకు ఏయే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారనే అంశాలను లోతుగా శోధించనున్నారు.