మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కిరణ్ పై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని.. స్త్రీ గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి చర్యను లైట్ తీసుకోమని చెబుతూ.. పార్టీ నుంచి కిరణ్ ను సస్పెండ్ చేసింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో కిరణ్ ను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు.
సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద అతడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ చర్యలను తప్పుగా భావించిన టీడీపీ నేతలు సొంత పార్టీకి చెందిన వ్యక్తైనా తప్పు చేస్తే వదలబోమని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి తరలిస్తున్నారు. అయితే అరెస్టుకు ముందు కిరణ్ ఓ వీడియో విడుదల చేశారు. “నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నా. ఈ వ్యాఖ్యలు ఎలాంటి దురుద్దేశంతో చేయలేదు. క్షణికావేశంలో మాత్రమే చేశా. క్షమించండి” అంటూ కిరణ్ కుమార్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.