కసబ్‌ను చూపెట్టినప్పుడు నాకెవరైనా తుపాకీ ఇస్తే కాల్చేద్దామనుకున్నాను. కానీ అప్పుడు నా వయస్సు పదేళ్లే. 26/11 దాడుల కీలక సూత్రధారి అయిన తహవ్వుర్ రాణాను తీసుకొచ్చినందుకు భారత్, అమెరికా సర్కార్ లకు నా ధన్యవాదాలు. రాణా నుంచి చాలా వివరాలు రాబట్టొచ్చు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులను పోషించే వారి పేర్లను రాణా నుంచి రాబట్టొచ్చు. అని ముంబయి దాడుల్లో బాధితురాలు, ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను గుర్తించడంలో కీలక సాక్షిగా ఉన్న దేవికా రోటావన్ అన్నారు. తహవూర్ రాణాను ఇండియాకు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ దీన్ని సాధ్యం చేసిన మోదీ సర్కార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఓ ప్రముఖ టీవీ ఛానెల్ తో మాట్లాడిన దేవిక.. అజ్మల్ కసబ్ మాదిరిగా టెర్రరిస్టులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌లో ఉన్న దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్ ఇతర కీలక సూత్రధారులను కూడా ఇండియాకు తీసుకొచ్చి మరణ దండన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దాయాది దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని, కసబ్ లాంటి కిరాతకుల్ని తయారు చేసే వారిని అంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ముంబయి దాడుల్లో బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు.