తెలంగాణ సర్కార్ పేదల ఆకలి తీర్చేందుకు ప్రజా పంపిణీలో కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. రేషన్ వ్యవస్థకు సార్థకత చేకూరేలా రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. రాష్ట్రంలో 3.10 కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో ఈ బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది.
పలు జిల్లాల్లో సన్న బియ్యం పంపిణీని మంత్రులు ప్రారంభించారు. ఇక మండలాలు, నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా సన్న బియ్యం లబ్ధిదారుల ఇళ్లలో పలువురు ఎమ్మెల్యేలు భోజనం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం పంపిణీపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయాలని సూచించారు. గతంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, ఇప్పుడు 30 లక్షల టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. దీనివల్ల ఖర్చు ₹10,665 కోట్ల నుంచి ₹13,600 కోట్లకు పెరిగిందని, 29 లక్షల రేషన్ కార్డులు పెరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.