ఏపీలో జులై 1వ తేదీన అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాకలో సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వయంగా చంద్రబాబు లబ్ధిదారులకు పింఛన్ అందించనున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్‌దారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం 7 వేల రూపాయల నగదు ఇవ్వనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65 లక్షల 18 వేల 496 మంది లబ్దిదారులకు 4 వేల 408 కోట్ల రూపాయలను పంపిణీ చేయనుంది. ఈ నేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్దిదారులకు నగదు అందజేస్తారు. సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెంచిన ఫించన్ వెయ్యి రూపాయలు కలిపి 4 వేల రూపాయలు అందజేస్తున్నామని అన్నారు.