టిడిపి, వైసిపి పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆదివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎంపీలు పార్లమెంటులో కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్, టిడిపి చీఫ్ చంద్రబాబు బీజేపీకి సరెండర్ అయ్యారని ఆరోపించారు. మోడీకి జగన్ సరెండర్ కావడం మంచిది కాదన్నారు ఉండవల్లి. ఏపీకి జరిగిన అన్యాయంపై ఎన్నికలకు ముందు అయినా మాట్లాడాలని సూచించారు.
కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నప్పటికీ విభజన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల చర్చనియాంశంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ పైన స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుకు వెళితే ఆ వ్యవస్థ రద్దు అవుతుందని.. కానీ టిడిపి, జనసేన కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.