సిక్కులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిక్కుమత పెద్దలు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ క్రమంలోనే సిక్కు మత పెద్దల విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ అంగీకరించారు. అలాగే గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయించాలని కోరగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
గురుద్వారాల్లోని గ్రంధిలకు పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగా ప్రయోజనాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి రోజున సెలవు ఇచ్చేందుకు అంగీకరించారు. అలాగే ఒక మైనారిటీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు సహాయం అందిస్తామన్నారు సీఎం జగన్. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని తనను కలిసిన సిక్కు పెద్దలకు తెలియజేశారు సీఎం జగన్.