జగన్ మగాడ్రా బుజ్జీ: కాంగ్రెస్ నేతల కొత్త స్వరాలు విన్నారా?

-

తమను తాము పొగుడుకోవడంలో, గొప్పలు చెప్పుకోవడంలో, సెల్ఫ్ డబ్బాలు పీక్స్ లో వాయించడంలో చాలా మంది నేతలు ముందుంటారు! వారిలో తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేర్లు చాలానే ఉన్నాయి. తన గురించి పక్కరాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటారు అని ఒకరంటే… దేశం మొత్తం మాట్లాడుకుంటారు అని మరొకరంటారు. కానీ… మన గురించి మనం డబ్బా కొట్టుకోవడం కాకుండా… శత్రువర్గం నేతలు పొగిడితే, ప్రత్యర్ధి వర్గం నేతలు ప్రశంసిస్తే, అప్పుడు వచ్చే కిక్కే వేరుకదా! ప్రస్తుతం జగన్ ఆ కిక్ ని ఎంజాయ్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!


అవును… గత కొన్ని రోజులుగా వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ నేతలు జగన్ ను తెగ పొగిడేస్తున్నారు. అతడికి అంత సీన్ లేదని నాడు చెప్పుడుమాటలు విని.. జగన్ చేయి వదిలేసింది కాంగ్రెస్ అధిష్టాణం. చిన్నపిల్లాడంటూ చిన్నచూపు చూసింది. అణిగిమనికి లేడని అణగదొక్కాలనుకుంది. దాని ప్రతిఫలం అనుభవించడానికి, జగన్ విలువ తెలిసిరావడానికి వారికి పెద్ద ఎక్కువసమయమేమీ పట్టలేదు. తిప్పితిప్పి కొడితే పదేళ్లు!!

నాడు వద్దనుకున్న పార్టీకి చెందిన బడా నేతలే నేడు జగన్ గురించి, జగన్ మార్కు పాలన గురించి తెగ ప్రశంసల వర్షాలు కురిపించేస్తున్నారు. ఇంతకూ ఈ విషయం సోనియమ్మకు తెలుసో లేదో తెలియదు కానీ… వీరు మాత్రం జగన్ ను పొగిడే విషయంలో వెనక్కి తగ్గడం లేదు!

కన్నడ కాంగ్రెస్ నేత, మోస్ట్ సీనియర్ నేత అయిన సిద్ధరామయ్య… జగన్ ని తెగపొగిడేశారు. కరోనా సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు సూపర్ అంటున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే… టీపీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి, జగన్ పై ప్రశంసల జల్లులు కురిపించేశారు. తాజాగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూడా ఇప్పుడు అదే రీతిన స్పందించారు.

క‌రోనా ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ పాల‌న సూపర్ అంటూ మొదలుపెట్టిన కోమటిరెడ్డి… కేసీఆర్ క‌న్నా జ‌గ‌న్ చాలా గొప్ప‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న‌ని కీర్తించారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో అయినా, క‌రోనా ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డంలో అయినా.. కేసీఆర్ క‌ంటే జ‌గ‌న్ 100 అడుగులు ముందున్నార‌ని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇలా వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరుగా కాంగ్రెస్ నేతలు జగన్ పై పొగడ్తలు కురిపించేస్తున్నారు. ఇంతకూ ఈ విషయం సోనియమ్మకు తెలిసే జరుగుతుందా.. ఆమె అనుమతి అనంతరమే జరుగుతుందా.. లేక జగన్ పొగిడే విషయంలో ఆ ప్రోటోకాల్ ని కాంగ్రెస్ నేతలు పాటించడం మానేశారా? ఢిల్లీ పెద్దలకే తెలియాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version