రాష్ట్రంలో ముఖ్యమంత్రిపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు మంత్రి బొత్ససత్యనారాయణ. అధికారంలో లేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామన్న ఆయన.. ఇప్పుడు దీనిని కాపాడుకోవాలి అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు దుర్భాషలాడుతూ.. అసభ్య పదజాలం వాడుతున్నారని ఇది మంచిది కాదన్నారు. ఒంటెద్దు పోకడలకు పోకండి.. కలసికట్టుగా పనిచేయండి అని పిలుపునిచ్చారు. చాలా రోజుల తర్వాత పార్టీ సమావేశం నిర్వహించామన్నారు బొత్స. ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో గడపగడపకు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని అన్నారు.
లోటుపాట్లను తెలుసుకుని వాటిని సవరించి ప్రజలకు మరింత లబ్ధి జరిగేలా చూడాలని.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. పాలనా సౌలభ్యం కోసం పలు నియోజకవర్గాలను కలుపుకొని జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి.. అందరం కలిసికట్టుగా ఉంటేనే అధికారంలోకి వస్తామన్నారు. పెద వాళ్లకు దోచి పెడుతున్నారని చంద్రబాబు అంటున్నారు.. ఇది అందరి సంపద.. అందుకే ఇది ప్రజలందరికీ అందాలి అన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. మనది అన్న భావనతోనే ఉండాలి తప్ప.. నాది అన్న భావన ఉండకూడదు.. కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు బొత్ససత్యనారాయణ.