గుంటూరు జిల్లాలో పురుగుల మందు తాగి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… గుంటూరు జిల్లా కేంద్రంలోని కొత్తపేట పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ కిరణ్ బుధవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సేకరించిన సమాచారం మేరకు బుధవారం కిరణ్ స్వగ్రామమైన ఫిరంగిపురంలో ఉదయం ఇంటి పైన వ్యాయామం చేసుకోడానికి వెళ్ళినట్లు తెలిసింది.
ఇద్దరు పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లాలని భార్య ఇంటిపైకి వెళ్ళి చెప్పగా, కిరణ్ తన భార్యను వారించి క్రిందికి పంపినట్లు తెలుస్తోంది. కాసేపటికి త్రాగునీరు కావాలని పెద్దగా కేకలు వేయడంతో భార్య వెళ్ళి చూడగా కిరణ్ అపస్మారక స్థితిలోకి మెల్లగా జారుకోవడం గమనించి బంధువుల సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం. కాగా,కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు విచారణలో తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.