మిగ్‌జాం తుపాను తీరం దాటాక కోస్తాను అతలాకుతలం చేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో వణికించింది. తుపాను, వాయుగుండగా బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటంతో వీటి ప్రభావం ఆంధ్రాపై పడనుంది. ఈ క్రమంలో ఇవాళ, రేపు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇప్పటికే మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అస్తవ్యస్తమైపోతోంది. బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికించాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కోతకు వచ్చిన పంట వర్షార్పణమవ్వడంతో అన్నదాతలు పొలాల్లోనే కుప్పకూలుతున్నారు. ఆరుగాలం కష్టపడినదంతా నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కోస్తా నీటిదిగ్బంధంలో చిక్కుకుంది. చాలా చోట్ల వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. దీనివల్ల పలుచోట్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తింది. ఇక లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు చెరువులను తలపించాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.