ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేవిధంగా ఈనెల 8వ తేదీ నుంచి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఎస్టీటీ, 42 ప్రిన్సిపాల్, 1264 టీజీటీ, 215 పీజీటీ పోస్టులను విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మార్చి 05 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 02న ఫైనల్ కీ విడుదల చేసిన తరువాత.. ఏప్రిల్ 05 పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నట్టు మంత్రి బొత్స సత్యానారాయణ ఏపీ సచివాలయంలో తాజాగా మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. తమ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలిపారు.