దేశ రాజధాని దిల్లీలోని మెట్రో రైల్లో ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. రాష్ట్రపతి భవన్‌కు సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌ను ద్రౌపదీ ముర్ము సందర్శించారు. అనంతరం కాసేపు మెట్రోలో ప్రయాణించారు. సామాన్యురాలిలా మెట్రోలో ప్రయాణిస్తున్న చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆమె పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టారు. ద్రౌపదీ ముర్ము కూడా విద్యార్థులతో ముచ్చటించారు. రైలులో సౌకర్యాల గురించి వారిని ఆరా తీశారు.
ఈ సందర్భంగా కొందరు విద్యార్థినులు పాటలు పాడగా వారిని రాష్ట్రపతి ప్రశంసించారు. విద్యార్థినులను మీరు పెద్దయ్యాక ఏం కావాలి అని అనుకుంటున్నారు అని అడగగాచాలా మంది విద్యార్థినులు డాక్టర్ అవ్వడం తమ గోల్ అని బదులిచ్చారు. ఓ విద్యార్థిని అదే ప్రశ్న అడగ్గా తాను క్రికెటర్ను అవ్వాలనుకుంటున్నానని చెప్పగా పెద్దయ్యాక నీవు కూడా విరాట్ కంటే ఎక్కువ పరుగులు సాధించాలని విద్యార్థితో ద్రౌపదీ ముర్ము సరదాగా అన్నారు.
రాష్ట్రపతి వెంట దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్ ఉన్నారు. మెట్రో పనితీరు, ఇతర వివరాలను డీఎంఆర్‌సీ ఎండీ వికాస్ కుమార్ రాష్ట్రపతికి వివరించారు. అనంతరం కొంతదూరం మెట్రో రైలులో ప్రయాణించారు. రాష్ట్రపతి మెట్రో రైడ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సింప్లిసిటీకి మారు పేరు ముర్ము అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
President Droupadi Murmu takes ride in Delhi Metro@rashtrapatibhvn @DCP_DelhiMetro pic.twitter.com/2j1bvec466
— DD News (@DDNewslive) February 7, 2024