ఏపీ రైతులకు అలర్ట్.. ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీ కల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97% ఈ-క్రాప్ నమోదు 70% రైతుల ఈ-కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు.
మిగిలిన 30% మంది రైతులతో ఈ నెల 10వ తేదీ కల్లా ఈ-కేవైసీ పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ-క్రాప్ నమోదు ముగిసిన తర్వాత ఆర్బికేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు. సామాజిక తనిఖీ అనంతరం ఈనెల 20వ తేదీన తుదిజాబితా ప్రదర్శించాలన్నారు.