ఎడిట్ నోట్ : మంచి తీర్పు ! ఓవ‌ర్ టు ఏపీ హైకోర్టు

-

ఎనిమిది మంది ఐఏఎస్ లు ఇష్టం వ‌చ్చిన విధంగా వ్య‌వ‌హ‌రించారు. వారిలో గోపాల‌కృష్ణ ద్వివేది,గిరిజా శంక‌ర్, రాజ‌శేఖ‌ర్‌, చిన వీర‌భ‌ద్రుడు, శ్యామ‌ల‌రావు, శ్రీ‌ల‌క్ష్మి, విజ‌య కుమార్, నాయ‌క్ ఉన్నారు. వీరంతా త‌మ నిర్ల‌క్ష్య వైఖ‌రికి త‌గిన మూల్యం చెల్లించాల‌ని కోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. వీరి ధోర‌ణి కార‌ణంగా విద్యార్థులు అవ‌స్థ‌లు ప‌డిన తీరును హైకోర్టు గుర్తించి రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేని విధంగా వీరికి శిక్ష‌లు విధించింది.

ముందుగా వీళ్లంతా వివిధ జిల్లాల‌కు పోయి అక్క‌డ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌స‌తి గృహాల‌ను సంద‌ర్శించి, ఆ పూట విద్యార్థుల భోజ‌నానికి అయ్యే ఖ‌ర్చులు భ‌రించాల‌ని, అక్క‌డి విద్యార్థుల‌తో కొంత స‌మ‌యం గ‌డ‌పాల‌ని సూచిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎవ‌రు ఏ జిల్లాకు వెళ్లాలో కూడా స్ప‌ష్టం చేసింది. ఓ విధంగా వీళ్ల‌కు జైలు శిక్ష విధించాలి అని న్యాయ‌మూర్తి చేసిన నిర్ణ‌యాన్ని ఆఖ‌రి నిమిషంలో ఆయ‌నే మార్చుకున్నారు. వైసీపీ స‌ర్కారులో ఇలాంటివి ఎన్నో ! సాక్షాత్తూ డీజీపీనే కోర్టుకు వ‌చ్చి వివ‌ర‌ణ‌లు ఇచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఆఖ‌రికి ఆయ‌న‌తో ఐపీసీలో ఉన్న కొన్ని సెక్ష‌న్లను న్యాయ‌మూర్తి చ‌దివించిన దాఖ‌లాలున్నాయి. సీఎస్ కూడా ఎన్నో సార్లు కోర్టుకు హాజ‌ర‌య్యారు. కొన్ని సార్లు హాజ‌రుకాకుండా తప్పుకున్నారు.

అధికారుల అల‌సత్వం కార‌ణంగా చాలా స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. కానీ అవేవీ ప‌రిష్కృతం కావు. న్యాయ స్థానాలు అంటే ప‌ట్టింపే లేని అధికారులు ఇప్ప‌టికీ మ‌న మ‌ధ్యే ఉన్నారు. కీల‌క స‌మ‌స్య‌లు కూడా వీళ్లు ప‌రిష్క‌రించ‌రు. కోర్టుల మాట విన‌రు.ఇలాంటి వేళ ఓ అనూహ్య తీర్పు రావ‌డంతో అంతా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ స‌ర్కారులో మొద‌ట నుంచి ఉన్న త‌ల‌నొప్పే అధికారుల అస్త‌వ్య‌స్త వ్య‌వ‌హార శైలి. ఎవ్వ‌రికీ చ‌ట్టం పై గౌర‌వం లేద‌ని నిన్న‌టి వేళ హైకోర్టు న్యాయ‌మూర్తి బ‌ట్టు దేవానంద్ సైతం ఆవేద‌న చెందారు.

కోర్టు ధిక్కారానికి పాల్ప‌డిన ఎనిమిది మంది ఐఏఎస్ ల‌పై నిన్న‌టి వేళ సంచ‌ల‌న తీర్పు వెలువ‌డింది. న్యాయస్థానం ఆ ఎనిమిది మంది ఐఏఎస్ ల‌కూ రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. ఆఖ‌రికి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో శిక్ష‌ను కాస్తా సామాజిక సేవా శిక్ష‌గా మార్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకున్న ఈ ప‌రిణామాలు సంచల‌నం అయ్యాయి. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో పాఠ‌శాల‌లు  ఉన్న ప్రాంగ‌ణంలో గ్రామ స‌చివాల‌యాల ఏర్పాటు వ‌ద్దే వ‌ద్ద‌ని కోర్టు చెబుతూ వ‌స్తోంది.

దీనిపై స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆదేశించింది. కానీ ఇవేవీ ప‌ట్టించుకోని ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు కోర్టు ధిక్కార నేరానికి పాల్ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. చ‌ట్ట ప్రకారం ప‌నిచేయడం అధికారుల బాధ్య‌త. కోర్టు ఆదేశాల‌ను అధికారులు ఉల్లంఘించ‌డంతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు ఇబ్బందుల‌కు గుర‌య్యారు. సీనియ‌ర్ ఐఏఎస్ ల నుంచి ఈ త‌ర‌హా అల‌స‌త్వం, చ‌ట్టం ప‌ట్ల అగౌర‌వ శైలిని న్యాయ స్థానం ఊహించ‌లేదు అని వ్యాఖ్య‌లు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version