కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. సోమవారం ఉదయం 11గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నిర్బంధించారు. దీంతో కోరం లేక అధికారులు ఎన్నికను రద్దు చేశారు. వాస్తవానికి తుని మున్సిపాల్టీలో మొత్తం 30మంది కౌన్సిలర్లకుగాను వైసీపీ బలం 27గా ఉంది. వీరిలో పది మంది ఇటీవల టీడీపీలో చేరిపోయారు. దీంతో మిగిలిన తమ పార్టీ కౌన్సిలర్లు కూడా చేజారిపోతారనే భయంతో, సోమవారం మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్దకు వారందరినీ తరలించి నిర్బంధించారు.
నిన్న ఉదయం నుంచీ అక్కడే మాకం వేసిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఆయన అనుచరులు కవ్వింపు చర్యలకు దిగారు. ఇరువర్గాల తోపులాట జరిగింది. రాజా సైతం టీడీపీ నేతలపైకి దురుసుగా దూసుకువచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నాలుగోసారి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. దాడి శెట్టి రాజా అక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీ సూచించారు. తునిలోకి బయటి వ్యక్తులు ఎవ్వరూ రాకుండా పోలీసులు చర్యలు చేపట్టనున్నారు.