గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వంశీని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. ఈ మేరకు మంగళవారం ములాఖత్ కానున్నారు. ఉదయం తాడేపల్లి ఇంటి నుంచి బయల్దేరి 10.30 గంటలకు జైలులో వంశీతో ములాఖత్ అవుతారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు కూడా సబ్ జైలు వరకూ ఆయన వెంట వెళ్లనున్నారు. అనంతరం వంశీతో జగన్ భేటీ అయి ధైర్యం చెప్పనున్నారు. ఆ తర్వాత వంశీ అరెస్ట్ప జైలు బయట స్పందించనున్నారు.
ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు మాత్రం వంశీకి బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. మరింత విచారణ జరగాల్సినందున వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు మరో రెండు కేసుల్లో పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. ఇంకో కేసులో నిందితుడిగా చేర్చనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వంశీతో జగన్ ములాఖత్ చర్చనీయాంశంగా మారింది.