ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఒకేదేశం-ఒకే ఎన్నిక అనే అంశం పై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని ఫ్రీ.. ఫ్రీ అంటూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు జనాలను ఆకట్టుకుంటున్నారని ఆవేదన చెందారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి పథకాలు తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తీసుకొచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పులు అనేవి ఫ్రీగా రావనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలన్నారు.
ఎన్నికల్లో గొప్పలకు పోయి.. ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. పరిధికి మించి అప్పులు చేస్తే.. ఇంకొన్నాళ్లకు అప్పులు కూడా పుట్టని స్థితికి వస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి అప్పులు చేయాలని సూచించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల విషయం పక్కనబెడితే.. ఏపీ, తెలంగాణలోని పాలకులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.