తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం వేళ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్.. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలని కోరుకున్నారు. సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థించారు. అలాగే రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రకృతిలో మమేకమై వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలతో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని తెలిపారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో అది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదని అన్నారు. చెట్టు పచ్చగా చిగురిస్తూ ప్రకృతి మాత నూతనోత్సహాన్ని సంతరించుకుంటుందని.. అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని కేసీఆర్ కోరుకున్నారు.