స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. అయితే ఆయనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు బాబుకు ఇంటి భోజనం అందించేందుకు అనుమతి ఇవ్వాలన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తిని కూడా కోర్టు అంగీకరించింది.
ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు ఇంటి నుంచి అల్పాహారం వెళ్లింది. ఇవాళ ఉదయం ఫ్రూట్ సలాడ్‌ను ఆయన సిబ్బంది తీసుకెళ్లారు. చంద్రబాబుకు ఇంటి భోజనానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని కుటుంబసభ్యులు పంపారు.
మరోవైపు చంద్రబాబుతో ములాఖత్‌కు ముగ్గురు కుటుంబసభ్యులను జైలు అధికారులు అనుమతించారు. ములాఖత్ సమయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి ఆయన్ను కలవనున్నారు. కాసేపట్లో చంద్రబాబుకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఆయన్ను ఉంచిన స్నేహ బ్లాక్ ఎదురుగానే జైలు ఆస్పత్రిలో పరీక్షలు చేయనున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడే వారిని నిర్బంధిస్తున్నారు.