ఆంధ్రప్రదేశ్ లో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచుతామని తెలిపారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. శనివారం గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని, విజయవాడ – ఢిల్లీ ఇండిగో సర్వీస్ ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.
మూడు నెలల్లోనే నాలుగు కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అక్టోబర్ 26న విజయవాడ – పూణే, అక్టోబర్ 27న విశాఖ – ఢిల్లీ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇక త్వరలోనే దుబాయ్, సింగపూర్ కి సర్వీసులు కూడా ప్రారంభిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం షార్జాకి సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు.
దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలో కొత్తగా మరో 200 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు రామ్మోహన్ నాయుడు.