తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే.. నాలుక కోస్తామని హెచ్చరించారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. గాంధీ భవన్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వివాదం బీఆర్ఎస్ పంచాయితీ అని.. కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటూ మాట్లాడాలి కానీ.. బీఆర్ఎస్ గొడవలోకి ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతున్నారని నిలదీశారు జగ్గారెడ్డి.
లోకల్-నాన్ లోకల్ పై స్పందించారు జగ్గారెడ్డి. పదేళ్లు అనుభవించిన తరువాత ఇప్పుడు ప్రాంతీయవాదం అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు పార్టీల్లో కండువా కప్పే సంప్రదాయాన్ని తెచ్చిందే కేసీఆర్ అని.. పార్టీలు మారిన వారికి ఆయన మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని గుర్తు చేశారు. టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి కి మంత్రి పదవీ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది కాదా..? అని ప్రశ్నించారు. పోలీసులు వినాయకచవితి ఉత్సవాలు చూసుకోవాలా..? బీఆర్ఎస్ నేతల పంచాయితీని చూసుకోవాలా..? అని ప్రశ్నించారు.