ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి (State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో పలు నూతన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీలో నూతన బార్ పాలసీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.ఏపీ (Andhra Pradesh)లో బార్ పాలసీ ఈ నెల (ఆగస్టు) 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.
నూతన బార్ పాలసీ తీసుకురావాలని ఈ భేటీలో ప్రాథమికంగా నిర్ణయించారు. అది పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఉండాలని పేర్కొన్నారు. అలాగే, నూతన బార్ పాలసీ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఉండాలని ఎక్సెజ్పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. టూరిజం శాఖ ఇచ్చే సూచనలు ఈ పాలసీలో చేర్చాలని ఆదేశించారు. పారిశ్రామిక కారిడార్లు విస్తరిస్తున్న నేపథ్యంలో బార్లను రీలొకేట్ చేసే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు, 50 స్టార్ హోటళ్లలో బార్లు, మైక్రో బ్రూవరీలు ఉన్నాయని అధికారులు వివరించారు.