అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై కీలక ప్రకటన చేశారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నవంబరు 16న అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు మా దృష్టికి వచ్చాయని తెలిపారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నదని…దశలవారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

సమ్మెలు ఆందోళనల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించబడవని వివరించారు. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యూటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదన్నారు. అంగన్వాడీ సిబ్బంది సానుకూల దృక్పథంతో ఆలోచించి సేవలలో ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.
ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. 5,31,446 గర్భవతి బాలింత తల్లులు, 13,03,384 మంది 3 సంవత్సరాల లోపు పిల్లలు, 7 లక్షల మంది 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఆరోగ్య, పోషకాహార సేవలు అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్నదని వివరించారు. అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు తల్లీ పిల్లల ఆరోగ్యాని కై చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రీస్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కార్యకర్తలు చక్కగా పనిచేయుట కేంద్రాల సందర్శనలో గమనించామని పేర్కొన్నారు.