ఏపీలోని అల్లూరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున జిల్లాలోని దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో రెండు ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు ఇళ్ళు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు గ్రామస్తులు నానా అవస్థలు పడ్డారు.
తెల్లవారుజామున కావడంతో ఫైర్ ఇంజిన్ చేరుకునే సరికే ఇళ్లు కాలి బూడిదయ్యాయి. అందులోని ప్రజలు క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇంట్లోని సామగ్రి కాలి బూడిదైనట్లు బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. మంటలు ఎలా వ్యాపించాయనే దానిపై క్లారిటీ రావాల్సి ఉండగా, దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.