క్యాన్సర్ రోగానికి అత్యాధునిక వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు తీసుకుంటున్న చర్యలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పేద రోగులకు ఎంతో మేలు చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఎంతో దార్శికతతో జగనన్న క్యాన్సర్ నియంత్రణకు కృషి చేస్తున్నారని తెలిపారు. మంగళగిరిలోని ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం క్యాన్సర్ నివారణ- ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని గారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సకు ఏడాదికి రూ.600 కోట్లకు పైగా నిధులు ఒక్క ఆరోగ్యశ్రీ కిందనే ఖర్చు చేస్తున్నదని తెలిపారు. మొత్తం 648 క్యాన్సర్ ప్రొసిజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందజేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 64 క్యాన్సర్ కేర్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో చికిత్స ఏకీకృతంగా ఉండాలే చూడాలని పేర్కొన్నారు. ఆయా ఆస్పత్రులన్నింటినీ క్యాన్సర్ గ్రిడ్ పరిధిలోకి తీసుకొస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. అందుకే విశాఖపట్టణంలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి కేంద్రంగా ఉన్న స్టేట్ క్యాన్సర్ గ్రిడ్‌లో కచ్చితంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అనుసంధానం కావాలని చెప్పారు. అక్టోబర్ కల్లా రెండు స్టేట్ క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు విడదల రజిని.