వైఎస్ఆర్సిపీ ముఖ్య నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి గురువారం అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. ప్రభుత్వానికి కనీసం ఓ ఏడాది సమయమైనా ఇవ్వాలని.. ఐదు నెలల సమయం కూడా ఇవ్వకుండానే ధర్నాలు చేయాలంటే ఎలాగా అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వైఎస్ జగన్ గౌరవించాలని అన్నారు. ఇక చిరంజీవిపై ఉన్న అభిమానంతోనే తాను రాజకీయాలలోకి వచ్చానని అన్నారు అవంతి శ్రీనివాస్. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలన్నారు. గత పది ఏళ్ల బిఆర్ఎస్ పాలలో హైదరాబాద్ ఎంతగానో డెవలప్ అయ్యిందన్నారు అవంతి. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మనవాళ్లు అన్నారని.. కానీ అలా జరగలేదన్నారు. హైదరాబాద్ అంత డెవలప్ కావడానికి అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండడమేనని చెప్పుకొచ్చారు అవంతి శ్రీనివాస్.