బిజెపిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు!

-

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బుధవారం ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు” అంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి కెసిఆర్ లేఖ రాశారని చెప్పుకొచ్చారు.

1,41 వేలకు పైగా ఎకరాలలో 300 మిలియన్ టన్నులకు పైగా ఐరన్ ఓర్ నిల్వలు అక్కడ ఉన్నాయని తెలిపారు. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు పెరుగుతాయన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు ఎమ్మెల్సీ కవిత. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో కూడా ఉందన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బిజెపి ఈ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు కవిత. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ అంశంపై అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపారు. కానీ ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వం సాకు చూపిస్తుందని మండిపడ్డారు. బిజెపికి తెలంగాణ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరం అన్నారు కవిత. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయం అన్నారు. బిజెపి ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news