తెలుగు విద్యార్థిని మృతి కేసులో అమెరికా పోలీసుల తీరుపై భారత్‌ ఫైర్.. దర్యాప్తునకు డిమాండ్‌..!

-

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో అమెరికా పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ ఘటనలో సియాటిల్ నగరానికి చెందిన పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియోపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలపై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికాను కోరుతూ.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది.

‘జాహ్నవి మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. సియాటిల్‌ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశాం. అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం’ అని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ వెల్లడించింది.

కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి(23).. ఈ ఏడాది జనవరి 23న అమెరికాలో కళాశాలకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెను ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సియాటిల్‌ నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆ మాటలన్నీ అతడి శరీరానికి అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. అవి తాజాగా వెలుగులోకి రావడంతో ఆయన తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version