ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకొచ్చింది జగనన్న సురక్ష కాదు.. ప్రజల్ని శిక్షించే కార్యక్రమం అని మాజీ మంత్రి పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా వైద్యరంగాన్ని భ్రష్టుపట్టించిందని తెలిపారు. ఒక పక్క నాసిరకం మద్యం ప్రజలకు అందిస్తూ.. మరోపక్క సురక్ష అంటూ ప్రచార ఆర్భాటానికి జగన్ రెడ్డి తెరతీశారని పేర్కొన్నారు.
సురక్ష కార్యక్రమంలో విధులు నిర్వహించే ఆశా సిబ్బందిని.. వైద్యారోగ్య సిబ్బందినే రక్షించలేని సీఎం రాష్ట్ర ప్రజల్ని రక్షిస్తాడా? అని ప్రశ్నించారు. అవినీతితో కుళ్లిపోతూ.. రాజకీయ కక్షతో రగిలిపోతున్న వైసీపీ వారికి, ముఖ్యమంత్రికే సురక్ష పథకం చాలా అవసరం అన్నారు. రాష్ట్రంలో ప్రజలు రోగాల పాలు కావడానికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవడానికి ప్రధాన కారణం జగన్ రెడ్డి అమ్మతున్న జేబ్రాండ్ మద్యమే అని తెలిపారు. జే బ్రాండ్ మద్యంతో నాలుగున్నరేళ్లలో లక్షలాది ప్రజలు ఆసుపత్రుల పాలైతే, వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని వెల్లడించారు మాజీ మంత్రి పీతల సీత.