విజయవాడ రాజకీయాలు అంటేనే చాలా డిఫరెంట్. ఒకప్పుడు కమ్యూనిస్టులకు ఈ నగరం కంచుకోట. అలాంటి చోట దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక, ఆ తర్వాత మళ్లీ టీడీపీ పుంజుకుంది. మొత్తం మూడు నియోజకవర్గాలు ఉన్న విజయవాడలో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బలంగానే ఉంది. నిజానికి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఒకటి మాత్రమే గత ఎన్నికల్లో ఓడిపోయింది. జగన్ సునామీ వీచినా.. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ సైకిల్ పరుగులు పెట్టింది. ఇక, సెంట్రల్‌లో కూడా కేవలం పాతిక ఓట్ల తేడాతోనే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇలా దూకుడు చూపించిన ఈ రెండు నియోజకవర్గాల్లో.. ఎన్నికలు ముగిసిన ఏడాది తర్వాత కూడా టీడీపీ పరిస్థితి అలానే ఉంది.
అయితే, ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పరిస్థితి బాగానే ఉన్నా.. ఎటొచ్చీ.. టీడీపీని కలవరపెడుతున్న నియోజకవర్గం పశ్చిమం. ఈ నియోజకవర్గంలో టీడీపీ స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ పార్టీ నేత 1983లో జయరాజు మినహా ఎవరూ కూడా బోణీ కొట్టలేదు. గతంలో కమ్యూనిస్టులు, తర్వాత కాంగ్రెస్.. మధ్యలొ ఒక సారి ప్రజారాజ్యం, గత రెండు ఎన్నికల నుంచి కూడా వైసీపీ విజయం సాధించాయి. అంతే తప్ప టీడీపీ ఇక్కడ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికలు మినహా మరెప్పుడు విజయం దక్కించుకున్న దాఖలా లేదు. కట్ చేస్తే.. ఇలా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టి, ప్రజలను పార్టీవైపు మళ్లించే నాయకులు కూడా లేక పోవడం ఇప్పుడు మరింత కలవరపరుస్తున్న వైనం. ఇక్కడ జలీల్‌ఖాన్ టీడీపీలో ఉన్నారు. వైసీపీ నుంచి ఆయన టీడీపీలోకి జంప్ చేసిన విషయం తెలిసిందే.
గత ఎన్నికలలో జలీల్ తన కుమార్తెను పోటీకి పెట్టారు. అయితే, ఆమె ఓడిపోయింది. అనంతరం ఆమె అమెరికాకు వెళ్లిపోయింది. ఇక, ఇప్పుడు జలీల్ నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి ఆరోగ్య రీత్యాలేదు. దీంతో తన తరఫున ఒకరిని రంగంలోకి తెచ్చారు. అయితే, ఈ విషయంలో ఎంపీ కేశినేని నాని విభేదించారు. ఆయన తన వర్గంగా ఉన్న నాగుల్ మీరాను ఇక్కడ నియోజకవర్గం ఇంచార్జ్‌ను చేయాలని భావిస్తు న్నారు. దీంతో ఇక్కడ పార్టీ డెవలప్‌మెంట్ విషయం కన్నా కూడా ఇంచార్జ్ పోస్టు విషయం ముడిపడి పో యింది. లాక్‌డౌన్‌కు ముందు ఇదే విషయం చర్చకు వచ్చింది. నేరుగా ఇది చంద్రబాబు వద్దకు కూడా చేరింది.
కేశినేని ఇప్పటికే పార్టీ వ్యవహారంతో ఆగ్రహంతో ఉండడం, జలీల్ ఖాన్ చెప్పిన వ్యక్తికి ఇంచార్జ్ పోస్టు ఇచ్చినా.. పరిస్థితి బాగయ్యే లా కనిపించకపోవడంతో చంద్రబాబు ఎటూ తేల్చలేకపోయారు. జలీల్ ను కాదని అడుగు వేస్తే.. ప్రధానమైన ముస్లిం వర్గం పార్టీకి దూరమవుతుందనే మరో భావన కూడా ఉంది. నాగుల్ మీరా ఉన్నప్పటికీ.. ప్రధాన ముస్లిం వర్గంలో ఆయన అంతంత మాత్రమే పలుకుబడి. సో.. మొత్తానికి ఈ ఇంచార్జ్ విషయం ఇప్పటికీ ముడిపడలేదు. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా పట్టుకునే వారు. పార్టీ కార్యక్రమాలు చేసే వారు కూడా కరువయ్యారని అంటున్నారు పరిశీలకులు.