కృష్ణా జిల్లాలోని హాట్ నియోజకవర్గాల్లో ఒకటి అయిన గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు గరంగరంగా మారాయి. ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ చెంత చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంశీపై 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య అస్సలు పడడం లేదు. వంశీ అంటే ఏ మాత్రం పొసగని, యార్లగడ్డ, దుట్టా వర్గాలు వంశీపై కత్తులు నూరుతున్నాయి. అసలు వంశీ వైసీపీ ఎంట్రీని వీరు ఎంత మాత్రం సహించలేదు. అయితే జిల్లాకే చెందిన మంత్రి, వంశీ సన్నిహితుడు అయిన కొడాలి నాని వంశీని వైసీపీ సానుభూతి పరుడిగా మార్చడంలో కీలకంగా వ్యవహరించిన మాట వాస్తవం.
కొడాలి నాని, వంశీ టీడీపీలో ఉన్నప్పటి నుంచే మంచి సన్నిహితులు. ఇక వైసీపీ గెలిచి నాని మంత్రి అయ్యాక ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ముందుగా వంశీయే బయటకు వచ్చి చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత చాలా మంది కమ్మ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు వంశీ వైసీపీ సానుభూతిపరుడిగా మారడంతో గన్నవరంలో యార్లగడ్డ, దుట్టా వర్గాలు వంశీని వైసీపీ నేతగా ఒప్పుకోవడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీ వైసీపీ కార్యకర్తలను, తమను ఎన్నో ఇబ్బందులు పెట్టారని వారు చెపుతున్నారు.
నిన్నటి వరకు వంశీ విషయంలో దుట్టా మాత్రమే దూకుడుగా ఉండగా.. ఇప్పుడు వెంకట్రావు సైతం ఫైర్ అవుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఇప్పుడు వారంతా కొడాలి నానిని టార్గెట్ చేస్తున్నారు. కొడాలి నానియే వంశీని రెండు మూడు సార్లు జగన్ దగ్గరకు తీసుకు వెళ్లారని. కానీ వంశీ ఇక్కడ వైసీపీ వాళ్లను ఇబ్బంది పెట్టిన విషయం ఆయనకు తెలియదా ? అని నానిపై ఫైర్ అవుతున్నారు. నాని గుడివాడ రాజకీయాలు చూసుకోక, ఆయనకు గన్నవరం రాజకీయాలతో ఏం సంబంధం అంటూ ఫైర్ అవుతున్నారు.
పైగా నియోజకవర్గంలో అధికారులు, పోలీసులు కూడా వంశీ మాటే వినాలని మంత్రి కొడాలి నాని ఆదేశాలు జారీ చేస్తున్నారని కూడా దుట్టా, యార్లగడ్డ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. ఏదేమైనా గన్నవరంలో వంశీకి సపోర్ట్ చేస్తోన్న మంత్రి నాని ఇప్పుడు అక్కడ నిజమైన వైసీపీ శ్రేణులతో పాటు దుట్టా, యార్లగడ్డ వర్గాలకు టార్గెట్ అవుతున్నాడు.
-vuyyuru subhash