మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అనాధగా మార్చారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. నేడు పల్నాడు జిల్లా యల్లమంద లో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలుగు తల్లికి జలహారతి ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు.
పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తెస్తామని.. కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు. మాజీ సీఎం మూడు రాజధానులు అంటూ మూడుముక్కలాట ఆడారని విమర్శించారు. ఐదేళ్లు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అనాధగా మార్చారని అన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో సీఎం జిల్లాల పర్యటనకు వస్తే పరదాలు ఏర్పాటు చేసే వారని, చెట్లు కూడా కొట్టే వాళ్లని విమర్శించారు.
నేడు తనపై ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు చంద్రబాబు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కాపాడుకుంటానని ఎమోషనల్ అయ్యారు.పేదల ఇళ్ల పెండింగ్ బిల్లులను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదని.. త్వరలోనే ఇళ్ల పెండింగ్ బకాయిలు అన్నీ క్లియర్ చేస్తామని పేర్కొన్నారు.