తెలంగాణ విద్యా వ్యవస్థలో రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్య సరస్వతి అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ..విద్యార్థులకు సౌకర్యవంతంగా, అత్యాధునికి హంగులతో ఆదర్శ ఇందిరమ్మ పాఠశాలలు నిర్మిస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి కొత్త నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలన్నారు. వారికి వర్గల్ విద్యా సరస్వతి అమ్మ వారి కరుణకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.సంపాదించిన ఆస్తులు ఎనాడైనా పోవచ్చని..గురువు నుంచి నేర్చుకున్న విద్యను ఎవరూ దొంగిలించలేరని వ్యాఖ్యానించారు.ప్రభుత్వం తరఫున దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం తప్పక ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు.