విజయవాడకి చరిత్రలో రాని విపత్తు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి సత్య కుమార్ యాదవ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిది రోజులుగా కురుస్తున్న వర్షాలతో 37 వార్డులు నీట మునిగాయని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రజల కోసం నిరంతరం పనిచేశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టాయి.. ఇప్పుడు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రతి ఇంటికి మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇంటింటికి వెళ్లి వ్యాధులపై సర్వే చేస్తున్నామన్నారు. 450 కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను విజయవాడకి రప్పించామన్నారు సత్యకుమార్. కేంద్ర ఆరోగ్య శాఖ నుండి నిపుణులను పంపాలని కోరామన్నారు. ఇక ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు మంత్రి సత్య కుమార్.
ప్రజలు ఇన్ని ఇబ్బందులలో ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగుళూరు వెళ్లారని మండిపడ్డారు. పాస్ పోర్ట్ వచ్చి ఉంటే లండన్ పోయేవాడేమోనని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉన్నాడు కాబట్టే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాడని అన్నారు.