కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ ప్రచారం చేస్తూ.. సోషల్ మీడియాలోనూ అదే హైలెట్ చేస్తున్న వైసీపీకి.. జనసేన పార్టీ షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. జగన్ ను సీబీఐ దత్తపుత్రుడిగా నే అభివర్ణించింది. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా అదే విధమైన సంబోధన చేయనున్నారు. ఆదివారం విడుదల చేసిన ప్రెస్ మీట్ లోనూ అదే పేర్కొన్నారు. రైతు భరోసా యాత్ర లో పవన్ కళ్యాణ్.. రెండుసార్లు వైసీపీ నేతలను హెచ్చరించారు. తనను దత్తపుత్రుడు అంటే ఇక నుంచి జగన్ ను సిబిఐ దత్తపుత్రుడు అని పిలుస్తారు అని అన్నారు.
పవన్ కళ్యాణ్ రెండుసార్లు చేసిన హెచ్చరికలను లైట్ తీసుకున్న వైసీపీ నేతలు పవన్ పై తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఇక తాము కూడా వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారు జనసేన నాయకులు. సిబిఐ దత్తపుత్రుడు గానే జగన్ ని పిలవాలని డిసైడ్ అయ్యారు. వైసీపీని చంచల్ గూడా షటిల్ టీం గా పిలవాలని నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీని మానసికంగా కించపరిచి వారి స్థైర్యాన్ని దెబ్బతీయాలనే వ్యూహాన్ని మొదటి నుంచి వైసీపీ నేతలు పాటిస్తున్నారు. ఈ విషయంలో వారు పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పవన్ కుటుంబ విషయాలను తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ఎదురు దాడికి దిగాలి అని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.