కార్తిక సోమవారం ఎఫెక్ట్.. శ్రీశైలంలో భక్తుల రద్దీ

-

దేశవ్యాప్తంగా కార్తీక దీపాలు దేదీప్యమానంగా వెలుగులీనుతున్నాయి. కార్తీక సోమవారం అది కూడా మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు శైవాలయాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా మహిళలు వేకువజామునే ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ముఖ్యంగా.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. స్నానఘాట్లు, ఆలయం ఎదుట గంగాధర మండపం, ఆలయ ఉత్తర మాఢవీధుల్లో భక్తులు కార్తిక దీపారాధన చేయడంతో ఆ ప్రాంగణాలు దేదీప్యంగా వెలిగిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news