కౌశిక్ రెడ్డి వ్యవహారం పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం జరుగుతున్న సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. మైక్ గుంజుకున్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సంజయ్ ను “ఒరేయ్ ఏ పార్టీరా నీది” అంటూ సంబోధించారు కౌశిక్ రెడ్డి.
కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డి చేసిన హంగామా పై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రోత్సహిస్తారో లేక కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తారో మీ ఇష్టం అన్నారు. ఇలాంటి ఘటనల వల్ల బీఆర్ఎస్ విధానం ఏంటో ప్రజలకు చెప్పాలని తెలిపారు. పరుష పదాలు నేర్పే పాఠశాలలను బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుందా..? అని అడిగారు. ఇవాళ జరిగిన ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీల మార్పు పై జీవితాంతం ఒకే పార్టీలో ఉన్న వాల్లు మాట్లాడితే బాగుంటుందని.. పార్టీలు మారిన వాళ్లు కూడా ఇతరులను ప్రశ్నించడం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు.