రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంచలన ప్రకటన చేశాడు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తమకు సమాచారం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
“కాంగ్రెస్ వాదిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల పార్టీలోకి రావడానికి ఆహ్వానిస్తున్నాం. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం రాహుల్ గాంధీకి స్థానిక పరిస్థితులను వివరిస్తాం. 2024 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. 2018లో తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. ఏపీలో పార్టీని ఇటుక ఇటుక పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నాం. విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి చేయకుండా వైకాపా, తెదేపాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయాలను ప్రజలు గుర్తిస్తున్నారు” అని కేవిపి పేర్కొన్నారు.