ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడంలేదని, అయితే దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 2016 నుంచి 2024 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంత మందికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం జరుగుతోందని… ఎన్డీయే కూటమిలో భాగంగా తమ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
‘ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. వివిధ శాఖలతో చర్చించి సభాముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో త్వరలోనే రూ.674 కోట్ల ధాన్యం బకాయిలను రైతులకు చెల్లించనున్నాం. గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహయ కేంద్రాలుగా మార్చుతున్నాం. తూర్పు గోదావరి కాకినాడలో కార్పొరేషన్ నుంచి ఉచితంగా రైతులకు టార్పాలిన్లు అందిస్తాం’ అని మంత్రి నాందెడ్ల వివరించారు.