మంత్రి లోకేష్ ను కలిసిన ఆర్టీసీ బస్ డ్రైవర్ లోవరాజు.. దేవర పాటకు డ్యాన్స్ చేసి..?

-

డ్యూటీలో ఉండగా దేవర సినిమాలోని పాటకు స్టెప్పులు వేసి సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రి లోకేష్ ను కుటుంబంతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 24న బస్సు రౌతులపూడి నుంచి తుని డిపోకు వెళ్తుండగా మార్గమధ్యలో కర్రల లోడ్ ట్రాక్టర్ అడ్డొచ్చింది. చిన్న రోడ్డు కావడం, బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో బస్సును నిలిపివేశారు. ఈ లోగా ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా కాసేపు దేవర సినిమాలోని పాటకు డ్యాన్స్ వేశాడు.

ఇది కాస్తా ఓ యువకుడు వీడియో తీయడంతో వైరల్ అయింది. సోషల్ మీడియాలో డ్రైవర్ లోవరాజు డ్యాన్స్ చూసిన మంత్రి లోకేష్ మెచ్చుకున్నారు. ఈలోగానే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో లోవరాజును అధికారులు సస్పెండ్ చేశారు. ఇది కాస్తా మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కలుస్తానని మాట ఇచ్చారు. దీంతో లోవరాజు కుటుంబంతో సహా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా లోవరాజు యోగక్షేమాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version